వాషింగ్టన్: అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం మరికొద్ది సేపట్లో జరగనున్న వేళ ఈ బెదిరింపులు ఒక్కసారిగా ఆందోళన కలిగించాయి. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయిస్తున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌తో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయించేందుకు సిద్ధమవుతున్న సమయంలో సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.30గంటల సమయంలో ఈ బెదిరింపులు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల క్యాపిటల్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని బైడెన్ ప్రమాణస్వీకారోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఈ కార్యక్రమంపై దాడి జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ట్రంప్ మద్దతుదారుల నుంచి ముప్పు ఉన్నట్టు తెలిపాయి. భద్రతా సిబ్బంది నుంచే దాడి జరగవచ్చని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. దీంతో క్యాపిటల్ హాల్ వద్ద 25వేల మంది నేషనల్ గార్డ్స్‌ని మోహరించారు.
ఇదిలా ఉండగా.. క్యాపిటల్ భవనం వద్దకు జో బైడెన్, కమలాహ్యారిస్ చేరుకున్నారు. కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా కుటుంబం హాజరు కాగా.. ట్రంప్ గైర్హాజరయ్యారు.