
నూజివీడు : జర్నలిస్టుల సమస్యలు జగనన్నకు చెబుదాం అనే నినాదాన్ని నూజివీడు జర్నలిస్టులు తెరమీదకు తెచ్చారు. నూజివీడు పట్టణంలోని అమర్ భవన్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) సమావేశాన్ని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ అబ్బాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ కార్యదర్శి నీలా వన వేంకటేశ్వర్లు (వెంకట్) మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆర్థిక భరోసా కల్పిస్తూ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం పట్ల వారందరూ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అదే రీతిగా జర్నలిస్టులను కూడా కార్మికులు గా ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆర్ ఎన్ ఐ నంబర్ రిజిస్ట్రేషన్ కలిగిన వార్త సంస్థలలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులందరికీ షరతులు లేకుండా నివేశన స్థలాలను అందించి ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలన్నారు. నగర ప్రాంతాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో నాలుగు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో ఐదు సెంట్లు చొప్పున జర్నలిస్టు సోదరులకు నివేశన స్థలాలను అందించాలన్నారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు అన్నివేళలా కార్పొరేట్ స్థాయి పూర్తి ఉచిత వైద్యం, జర్నలిస్టు కుటుంబంలోని పిల్లలకు చదివినంత మేరకు అన్ని విద్యాసంస్థలలో ఉచిత విద్యను అందించడం, జర్నలిస్టు కుటుంబాలకు భరోసా కల్పిస్తూ బీమా ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల చల్లపల్లిలో తన పిల్లలకు ఫీజులు కట్టలేక బలవన్మరణానికి గురైన చంద్ర వంటి స్థితి ఏ ఒక్క జర్నలిస్టుకు జరగకూడదన్నారు. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు 25 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక చేయూతగా అందించాలని కోరారు. మిగిలిన అన్ని సంక్షేమ పథకాలు షరతులు లేకుండా అమలు జరపాలన్నారు. ఈ మేరకు నూజివీడు విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డికి వినతి పత్రం అందించేందుకు జర్నలిస్టులు సమైక్యంగా కదలి రావాలన్నారు. అడగనిదే అమ్మయినా పెట్టే పరిస్థితి ఉండదని, సమస్యలను నేరుగా సీఎంకు చెబితేనే అర్థం అయ్యే స్థితి ఉంటుందన్నారు.
ఏలూరు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి :
ఏలూరు నగరంలో డిసెంబర్ మూడవ తేదీన ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) మహాసభలు నిర్వహించేందుకు సకలం సన్నద్ధం చేస్తున్నట్లు ఫెడరేషన్ కార్యదర్శి నీలా వన వేంకటేశ్వర్లు (వెంకట్) తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేసేందుకు ప్రతి జర్నలిస్ట్ సైనికునిలా కృషి చేయాలన్నారు. తమ తోటి జర్నలిస్టులను మహాసభలకు తీసుకురావాలని సూచించారు. మహాసభల నిర్వహణలో నిధుల సమీకరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఫెడరేషన్ పట్టిష్టతకు, సభ్యత్వాల నమోదుకు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై కృషి చేసేందుకు సమైక్యంగా కదలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.