
ఏలూరు : ఏలూరు జిల్లా నూజివీడులో శుక్రవారం నాడు జరిగిన కార్కక్రమంలో అసైన్డు, లంక భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నట్లు తెలిపారు. 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నామని… కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. 27లక్షల 42 వేల ఎకరాలకు సంబంధించి16 లక్షల 21వేల మందికి హక్కులు కల్పించబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారన్నారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు.
ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగింది.. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. మోసం చేయడానికి మీ ముందుకు వస్తారు.. ఎన్నో హామీలు ఇస్తారు.. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా? మీరే ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని మరోసారి స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.