
నూజివీడు : నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీలోని శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆచంట నరేంద్ర ఇంటిలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. హైదరాబాదులో ఉంటున్న కుమార్తె ఇంటికి ఆచంట నరేంద్ర దంపతులు ఐదు నెలల క్రితం వెళ్లారు. ఇంటి ఆవరణ పరిశుభ్రం చేసి ముగ్గు వేసేందుకు వచ్చే పనిమనిషి నాగమ్మ గురువారం ఉదయం తాళం పడి ఉండడాన్ని గుర్తించింది. ఇంటి యజమానులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఇంటి లోపల అన్ని చిందరవందరగా పడి ఉండడాన్ని గుర్తించారు. వేలిముద్రంలో నిపుణులు రానున్నట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న ఇంటి యజమానులు హైదరాబాదు నుండి బయలుదేరి వస్తున్నట్లు తెలియచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో చోరీ సంఘటన తో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసు యంత్రాంగమంతా సీఎం పర్యటనపై దృష్టి సారిస్తే, సందట్లో సడేమియగా చోరశిఖామణులు తమ చేతివాటాన్ని చూపించే పనిలో పడ్డారు.