Breaking News

విజయమే పరమావధిగా టిడిపి – జనసేన ఐక్య పోరాటం

నూజివీడు : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో ముందుకు సాగాలని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ బర్మా ఫణి బాబు, నియోజకవర్గ పరిశీలికులు బొడ్డు వేణుగోపాలరావు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరీదు శివరామకృష్ణ లు అన్నారు. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం – జనసేన పార్టీ నేతల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోసపూరిత హామీలను ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు నేడు ప్రజల్ని ఏ మార్చేందుకు మరోసారి కుయుక్తులు పన్నుతున్నారన్నారని అన్నారు. ఒకే ఒక్క రూపాయికి అక్క చెల్లెమ్మలకు సొంత ఇంటి కల నెరవేరుస్తారని వైసిపి అధినేత జగన్, స్థానిక శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు హామీ ఇచ్చి తుంగలో తొక్కినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చాక అలాట్మెంట్ లెటర్లని పట్టాలని చివరికి రుణాలని లబ్ధిదారులను ఈ ఎమ్మెల్యే సమావేశాలు పెట్టి మాయ చేసాడన్నారు. ఇప్పుడు లబ్ధిదారుల నుండి తీసుకున్న రుణాలకుగాను వారికి బ్యాంకుల నుండి నోటీసులు వస్తుంటే మాట మాత్రం మాట్లాడని నాయకుడు ఎమ్మెల్యే అవ్వడం శోచనీయమన్నారు. చింతలపూడి ఎత్తిపోతలను నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను కడగండ్ల పాలు చేసిందని దీనిపై కనీసం మాట్లాడని వ్యక్తి కి రైతులు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వరుసగా కరోనా పరిస్థితులు, చీడపీడలతో మామిడి రైతు నష్టపోతుంటే కనీసం పంట నష్టపరిహారం పై ప్రశ్నించని వ్యక్తి నేడు ఏపీకి జగన్ అవసరం అంటూ ప్రజల ముందుకి వస్తున్నారని జగన్ ఎందుకు అవసరం లేదో చెబుతూ అధికార పార్టీ నాయకులను నిలదీసేందుకు జనసేన – తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో స్థానిక వైసిపి నాయకులు ఇసుక, మట్టి అమ్మకాలలో పేదలను దోచుకున్నారని స్థానిక నాయకుల అవినీతిని పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికార పార్టీ దోపిడీలను తెలియజేయాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో నకిలీ ఓట్లను చేర్చడం ద్వారా అధికారంలోకి రావాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ముసాయిదా ఓటర్ల జాబితాలో అనర్హులు ఉంటే సదరు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఓట్ల తొలగింపు, చేర్పుల్లో పారదర్శకత ఉండేలా చూడాలన్నారు. ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, టిడిపి యువనేత అట్లూరి వెంకట రవీంద్ర లు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నూజివీడుకు పర్యటన నిమిత్తం వస్తుంటే రోడ్లు కూడా వేయలేని దుర్భర స్థితిలో స్థానిక నాయకులు ఉన్నారని దుయ్యబట్టారు. నిత్యం ఆర్భాటంగా ప్రచారాన్ని కొనసాగించే అన్ని సంక్షేమ పథకాలలో ఏ ఏటి కా ఏడు అర్హులను తొలగించుకుంటూ వస్తున్నారని, ఈ మేరకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలలో జగన్ పాలన పట్ల అసహ్యం వ్యక్తం చేస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రజా పాలన కోసం ఎదురుచూస్తున్నట్లు హర్షద్వానాల మధ్య తెలిపారు. జై టిడిపి – జనసేన ఐక్యత, లాంగ్ లివ్ టిడిపి – జనసేన సమైక్యత అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లూరి రవీంద్ర, నూతక్కి వేణుగోపాలరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి ప్రసాద్, ముసునూరు రాజా, మరిడి చిట్టి బాబు, జగ్గవరపు వెంకట్ రెడ్డి, సంగీతరావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *