Breaking News

కార్తీకమాస విశిష్ఠత

కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది.స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది. కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *