Breaking News

గుడివాడ డివిజన్‌లో 27 కేంద్రాల ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్

కొనసాగుతున్న రెండవ డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ
పకడ్బందీగా మాస్క్ ల డ్రైవ్ ను చేపడుతున్నాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

తెలుగు తేజం, గుడివాడ : గుడివాడ డివిజన్ పరిధిలో 27 కేంద్రాల ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుండి ఇప్పటి వరకు గుడివాడ డివిజన్లో 173 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు డివిజన్ లో 1,612 కరోనా కేసులు వచ్చాయని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని డివిజన్ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 45 ఏళ్ళు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 12 వేల మందికి మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఈ నెల 12 వ తేదీ నుండి రెండవ డోస్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఈ నెల 22 వ తేదీన రెండవ డోస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కూడా చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 3 వేల మందికి రెండవ డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. గుడివాడ డివిజన్లో మాస్క్ ల డ్రైవ్ ను చేపట్టామన్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు సమావేశమై మాస్క్ లను ప్రతి ఒక్కరూ ధరించేలా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గుడివాడ పట్టణంలోని షాపులు, దుకాణాలను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరుచుకునేందుకు అనుమతులు ఉన్నాయని, ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. దేశంలో 18 ఏళ్ళు నిండిన వారందరికీ మే 1 వ తేదీన నుండి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 24 వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా 18 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 2 కోట్ల 04 లక్షల 70 వేల 364 మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారని తెలిపారు. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ ఆర్డర్లు పెట్టాలని సీఎం జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి నుండి ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగతావి పనిచేయవన్నారు. దుకాణాలు, ప్రజారవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేయనున్నారని తెలిపారు. ఫార్మసీలు, ల్యాబ్ లు, మీడియా, పెట్రోల్ బంకులు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీస్ లకు కర్ఫ్యూ నుండి ప్రభుత్వం మినహాయింపునిచ్చిందన్నారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్ళే రోగులకు ఎటువంటి ఆంక్షలు ఉండవని మంత్రి కొడాలి నాని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *