Breaking News

పేదవాడి కష్టార్జితం చెదలుపాలు

పందుల వ్యాపారి దాచుకున్న రూ.5 లక్షల నగదుకు చెదలు
తెలుగు తేజం మైలవరం, : ఓ పేదవాడి 15 నెలల కష్టార్జితం చెదలపాలైంది. అక్షరాల మూడు లక్షల రూపాయలు మట్టిపాలైంది. రూపాయి రూపాయి కూడబెట్టి సొంతిల్లు కట్టుకోవాలన్న అతడి కల కల్లయ్యింది. కలోగంజో తాగి దాచుకున్న సొమ్ము పనికిరాకుండా పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. కృష్ణాజిల్లా మైలవరం పట్టణం విజయవాడ రోడ్డులో వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో బిజిలీ జమలయ్య నివాసముంటున్నారు. పందులు పెంచి అమ్మే జమలయ్య సొంతగా ఇల్లు కట్టుకుందామని ఏడాదిన్నరగా తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని కూడబెడుతూ వచ్చాడు. బ్యాంకు ఖాతా లేకపోవడంతో ఆ సొమ్మును ఇంటిలోనే ఒక ట్రంకు పెట్టెలో దాచుకున్నాడు. ఇటీవల పందుల వ్యాపారానికి లక్ష రూపాయలు అవసరమైంది. దాంతో సోమవారం రాత్రి డబ్బు దాచుకున్న ట్రంకు పెట్టెను తీసి చూసిన జమలయ్య నిర్ఘాంతపోయాడు. పది, యాభై, వంద, ఐదొందలు ఇలా దాచుకున్న నోట్లకు చెదలుపట్టి ఉండడంతో జమలయ్య బావురుమన్నాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు రావడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దాంతో జమలయ్య ఇంటికి వెళ్లిన పోలీసులు ఆ సొమ్ములు ఎక్కడైనా దొరికిన డబ్బా, లేక నిజంగానే దాచుకున్న సొమ్ముకు చెదలు పట్టిందా అని విచారించారు. చివరకు సొమ్ము అతడిదే అని తేల్చారు.

ఇళ్లు కట్టుకుందామని దాచాను

మంచి ఇల్లు కట్టుకుందామని సొమ్ము దాచుకున్నా. బ్యాంకులో వేస్తే పని మానుకొని బ్యాంకు చుట్టూ తిరగాలని ఇంట్లో ట్రంకు పెట్టెలో పెట్టుకున్నాను. పందులను పెంచి అమ్ముకున్న సొమ్ము. ఏడాదిన్నరగా దాసుకున్నాను. మొత్తం చెద తినేసింది. నాకు న్యాయం చేయండి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *