Breaking News

రైతులను ఆదుకోవాలి.. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

– నారా లోకేష్ లేఖకు సీఎం జగన్ స్పందించి రైతులను ఆదుకోవాలి
– నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న నారా లోకేష్
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుతేజం, గుడివాడ: రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారని, సీఎం జగన్మోహనరెడ్డి స్పందించి రైతులను ఆదుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుభరోసా కేంద్రాల్లో కూడా ఎరువులు అరకొరగా లభిస్తున్నాయన్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, అపరాల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీని ప్రభావం దిగుబడులపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో ఎంఆర్పీ ధరలకే డీఏపీ అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని కోరినట్టు శిష్ట్లా లోహిత్ చెప్పారు. అలాగే ఈ నెల 30 వ తేదీన నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 1.45 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారని చెప్పారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 3.30 గంటలకు చిత్తూరు సబ్ జైలుకు చేరుకుంటారన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అన్నా క్యాంటీన్ ధ్వంసం ఘటనను ప్రతిఘటించి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్సీ జీ శ్రీనివాసులుతో పాటు ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలను నారా లోకేష్ పరామర్శిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు చంద్రగిరి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేతలు భాస్కర్, భానుప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. 6.15 గంటలకు పెరుమాలపల్లె చేరుకుని రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేత సోమనాథ్ రెడ్డిని నారా లోకేష్ పరామర్శిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా రైతు సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు వెళుతోందని చెప్పారు. రైతుల కోసం చంద్రబాబు, నారా లోకేష్ లు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. కుప్పం ఘటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శిష్ట్లా లోహిత్ హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *