Breaking News

రైతుల ఆశలు నీళ్ల పాలు

94,116 హెక్టార్లలో పంటలకు తీరని న ష్టం

నీటిలో తేలియాడుతున్న పంటలు

అవనిగడ్డలో అత్యధికంగా 155.2 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లా సగటు వర్షపాతం 73.8 మిల్లీ మీటర్ల

సకాలంలో ఆదుకోవాలని రైతుల వేడుకోలు

నేడూ వర్షం కురిసే అవకాశం

మచిలీపట్నం : కృష్ణా జిల్లా లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షం రైతులను నిండా ముంచింది. నివర్‌ తుఫాన్‌ రూపంలో వచ్చిన విపత్తుతో జిల్లా రైతులు కుదేలయ్యారు. భారీ వర్షాల తాకిడికి పైరు మొత్తం నేలపై వాలిపోగా, దానిపై నుంచి వర్షపునీరు పారుతోంది. కష్టపడి ఎంతో ప్రయాసలు పడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటి పాలయిందని రైతులు కంటతడి పెడుతున్నారు. శనివారం కూడా కోస్తాతీరం వెంబడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో పంట చేతికి రాదనే భయం రైతులను వెంటాడుతోంది. నివర్‌ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో 46 మండలాల్లోని, 523 గ్రామాల్లో 94.116 హెక్టార్లలో వరి, వేరుశెనగ, మినుము, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. వ్యవసాయశాఖ అధికారులు పలు మండలాల్లో నీటమునిగిన పంటపొలాలను శుక్రవారం పరిశీలించారు. వర్షాలు తగ్గనందున పంట నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది. మచిలీపట్నం, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, గూడూరు, ఘంటసాల, కంచికచర్ల, గన్నవరం, కైకలూరు, గుడివాడ, పామర్రు, పెదపారుపూడి, విజయవాడ రూరల్‌, తోట్లవల్లూరు తదితర మండలాల్లో వరి, పత్తి ఇతర పంటలు నీట మునిగినట్టు అధికారులు గుర్తించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట రెండు, మూడు రోజులకంటే అధికంగా నీటిలో ఉంటే కంకులకు మొలకలొస్తాయని రైతులు అంటున్నారు. అదే జరిగితే కోసినా ఫలితం ఉండదంటున్నారు.
భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయి, తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునే ందుకు ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. పంట బీమా, నష్టపరిహారం వచ్చేలా చేస్తే కొంతవరకు కోలుకునే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. వర్షాలు తగ్గిన అనంతరం దెబ్బతిన్న పంట వివరాలను నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *