2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా
2024 లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే అధికారం
రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం
గుడివాడ, సెప్టెంబర్ 9: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పదే పదే తిట్టే వైసిపి నేతలను డబుల్ ఫోర్ ట్వంటీ అనాలా అని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమనేది కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ప్రశ్నించారు. కొంతమంది వైసిపి నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని 420 అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సైతం నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను విమర్శించేవాళ్లు ఫిఫ్టీ ఫిఫ్టీలా అని అన్నారు. మాకు చంద్రబాబు నేర్పిన సంస్కారం ఉంది కాబట్టే వైసిపి నేతల్లా మాట్లాడలేకపోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఇష్టానుసారంగా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఇందుకు కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటనలే నిదర్శనమని చెప్పారు. వైసిపి నేతల పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో టిడిపి నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్ లను లక్ష్యంగా చేసుకొని వైసిపి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అవన్నీ నిజమైతే చంద్రబాబును ప్రజలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకునేవారా అని ప్రశ్నించారు. ప్రజల తీర్పును గౌరవించి, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తూ పేదలకు భోజనం పెడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేస్తున్నా వాటిని పునర్నిర్మిస్తూ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజమని అన్నారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం శాశ్వతమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని అన్నారు. 2024 ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీదేనని జోస్యం చెప్పారు. లోన్ యాప్ వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోన్ యాప్ వేధింపులపై అనేక కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా నడుస్తున్న లోన్ యాప్ లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే రాజమండ్రిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోనూ లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా లోన్ యాప్ వేధింపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్యకు కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను సత్వరం పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని శిష్ట్లా లోహిత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.