Breaking News

శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య విగ్రహ స్థాపనతో దండకారణ్యం గా ఉన్న జంక్షన్ సస్య శ్యామలం గా మారింది

అక్షర రూపం: తాడి రంగారావు

. శ్రీ అభయాంజనేయ స్థల పురాణం

కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్ లో నూజివీడు జమీందారు ఎం. ఆర్, అప్పారావు తండ్రి శ్రీ మేక వెంకటాద్రి అప్పారావు బహుదూర్ స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని 1938వ సంవత్సరంలో ప్రతిష్టించారు. జమిందార్ మేకా వెంకటాద్రి అప్పారావు బహుదూర్ ఒకసారి హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయటంతో ఆహారం కోసం వెతికారు. కానీ చుట్టుపక్కల ఎక్కడ ఆహారం కానీ పళ్ళు కానీ లేవు. ఎటు చూసినా బీడు భూములు, డొంకలు, ముళ్ళ పొదలతో నిండి అంతా నిర్మానుష్యం గా ఉంది. జమిందార్ కి ఆకలిబాధ ఎక్కువ అయింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. హఠాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమీందారు చేతిలో అరటిపండు పెట్టి అదృశ్యమైంది. ఆ పండును భుజించిన జమిందార్ కు ఎంతో శక్తి వచ్చింది. కనుక సాక్షాత్ శ్రీరామ పద భక్తుడైన ఆంజనేయస్వామి వారే అలా కోతి రూపంలో వచ్చి అరటిపండు ఇచ్చి వెళ్ళారని గ్రహించిన జమీందారు హృదయం భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందింది. అడగకుండా తన ఆకలి తీర్చిన కొండంత దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించాలని ఆయన మనసులో తక్షణం సంకల్పం కలిగింది. ఒకమహాత్కార్యానికి తొలి బీజం పడిన అద్భుత క్షణాలవి. తన భక్తులను దుష్టగ్రహ పీడన భారినుండి రక్షించేందుకు స్వయంగా విచ్చేసిన ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించిన జమీందారు నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో స్వామివారి విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పటికి ఆ ప్రాంతంలో నాలుగైదు పూరిళ్లు తప్ప ఏమీ లేవు. ఎలాంటి అభివృద్ధి లేదు. రామాయణ మహా కావ్యంలో దండకారణ్యంలా ఉండేది. ఆనాడు దండకారణ్యంలో శ్రీరాముడు నడిచి వెళుతుండగా ఆ స్వామికి ఆకలివేస్తుంది. తన స్వామి ఆకలి గ్రహించిన ఆంజనేయుడు వెంటనే అరటి పండ్లను తీసుకొనివచ్చి శ్రీరామునికి ఇచ్చి ఆయన క్షుద్బాదను తీర్చాడు. ఆ గాథను తలపించే విధంగా హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో రామా… ఆగు ఇవిగో అరటిపండ్లు అంటున్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని , ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు. శ్రీరామనవమి నాడు ఈ ఆలయంలో సీతారాముల కల్యాణ వేడుక అత్యద్భుతంగా భక్తుల నయనాల కమనీయ దృశ్యంగా జరుగుతుంది.*శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ*పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంతినీడి సన్యాసి లింగం నాయుడు ఈ విగ్రహానికి సజీవ రూపకల్పన చేశారు. సిమెంట్ తో స్వామివారి విగ్రహాన్ని తయారుచేసి ఎంతో వ్యయప్రయాసలతో ఎడ్లబండిపై తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. పెరికీడు వంతెన గ్రామానికి చెందిన నూజివీడు ఎస్టేట్ సూపర్ వైజర్ గా పనిచేసిన తాడి లక్ష్మయ్య ఈ విగ్రహం నిర్మాణంలో అత్యంత చురుకుగా వ్యవహరించి విగ్రహ ఏర్పాటుకు కృషి చేశారు.*హనుమాన్ జంక్షన్ గా రూపాంతర దృశ్యకావ్యం*శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని జంక్షన్ లో స్థాపించుటకు ముందు ఈ ప్రాంతాన్ని బాపులపాడు జంక్షన్, అప్పనవీడు జంక్షన్, ఏపూర్ జంక్షన్ అని పిలిచేవారు హనుమాన్ దివ్య రాకతో ఈ ప్రదేశం హనుమాన్ జంక్షన్ గా రూపాంతరం చెందింది. హనుమాన్ జంక్షన్ జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందినా రెవిన్యూ రికార్డుల్లో మాత్రం పేరు లేకపోవడం ఒక లోటు గా చెప్పుకోవాలి.*శ్రీ అభయాంజనేయ స్వామి*శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతోబీడువారిన ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా సస్యశ్యామలం అయింది. ఆనాటి శ్రీరాముని పరమ పావన పాద స్పర్శతో శిల స్త్రీ గా మారితే ఈనాడు ఈ వజ్రకాయుని దివ్యప్రతిష్ఠతో ప్రకృతి పులకించి పచ్చని సిరులతో సొగసు సోయగాలు సంతరించుకుంది. ఒక నాడు ఎటు చూసినా బీడువారి ముళ్ళు, రాళ్లతో నిండిన ఈ ప్రదేశం స్వామివారి రాకతో పచ్చని పంటపొలాలతో, కూరగాయల తోటలతో, పండ్లు ఫలాల సముదాయాలతో మెట్ట ప్రాంతానికి వారధిగా, ధనరాశులకు కొలువుగా విలసిల్లుతుంది. అంతేకాదు ఎందరో స్వాతంత్ర సమరయోధులకు, నాయకులకు, విద్యావంతులకు ప్రసిద్ధులకు పుట్టినిల్లుగా మారి భాసిల్లుతోంది. స్వామి ఆంజనేయ మీ పవిత్ర పాదస్పర్శతో పుడమితల్లిని పులకింపజేసి వికసిత మధుర ధరస్మితని చేశావు. మాకు బుద్ధిబలాన్ని ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశర్యవంతుల్ని చేశావు. నీవు ప్రసాదించిన ఆత్మస్థైర్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తుందoటూ హనుమాన్ జంక్షన్ లో భక్తులంతా స్వామివారిని నిత్యం భక్తిప్రపత్తులతో కొలుస్తుంటారు.*భక్తులకు రక్ష హనుమాన్*హనుమాన్ జంక్షన్ లో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందు స్వామి వారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రజల ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా లారీలు, కార్లు, మోటార్ బైక్ లు, ఏ పెద్ద చిన్న వాహనమైన సరే కొనుక్కునే వారంతా ముందుగా శ్రీ స్వామి వారి గుడికి వచ్చి వాహన పూజలు చేయించుకొని వెళ్తుంటారు. కొండంత కష్టాలతో తన దరికి వచ్చిన భక్తుల కష్టాలు తీర్చి దుష్ట గ్రహ పీడలు తొలగించి అండగా నిలిచే శ్రీ అభయాంజనేయ స్వామి దర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గుడి తెరచి ఉంచుతారు. నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. *ముఖ్య విశేషాలు*నిత్యం భక్తుల సందర్శనంతో రద్దీగా ఉండే శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉండటంతో 1993వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంది. రీజినల్ జాయింట్ కమిషనర్ రాజమండ్రి పరిధిలో ఉన్న ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. 1992 వ సంవత్సరంలో 77 వేల రూపాయల ఆదాయం ఉన్న ఈ దేవాలయం 2021 నాటికి 52 లక్షల రూపాయలకు చేరుకుంది. భక్తుల తాకిడి పెరిగిందనడానికి ఇదే నిదర్శనం..1985 లో హనుమాన్ జంక్షన్ కు చెందిన కనుమూరి సూర్యనారాయణ రాజు( చిన్నరాజు ) సిమెంట్ తో హనుమాన్ విగ్రహాo ప్రతిష్ట జరగకుండా నిర్మించారని, హనుమాన్ జంక్షన్ అభివృద్ధి దృష్ట్యా శ్రీస్వామివారి నల్లరాతి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఊహించని రీతిలో అభివృద్ధి చెంది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుoది.*హనుమత్ జయంతి ఉత్సవాలు* శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం మే నెలలో ఆరు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నాలుగు రోడ్ల కూడలిలో విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం కాంతులతో ప్రకాశిస్తూ రకాల అలంకరణలు భారీ కటౌట్లతో ఉత్సవాలు ఎంతో కమనీయంగా జరుగుతాయి. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులంతా ఆనంద పరవశంతో ఉత్సవాలను జరుపుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి భక్తులు ఈ ఉత్సవాలకు తరలిరావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *