శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. తుపాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది.సముద్ర తీరానికి చేరిన స్వర్ణరథం మయన్మార్ దేశానికి చెందినదిగా గుర్తించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బుధవారం తహసీల్దార్ చలమయ్య, భావనపాడు మెరైన్ సీఐ దేవుళ్లు, నౌపడ ఎస్ఐ ఐ.సాయికుమార్ తీరానికి చేరిన రథాన్ని పరిశీలించారు. రథంపై ఉన్న భాషను గూగుల్లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదని మెరైన్ సీఐ చెప్పారు.