Breaking News

ప్ర‌కృతి సాగు.. ఆరోగ్యానికి సోపానం : జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఆవ‌ర‌ణ‌ల్లో ప్ర‌కృతి సాగును చేపట్టాలని పిలుపు

విజయవాడ : ఆరోగ్యానికి సోపాన‌మైన ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లాలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఆవ‌ర‌ణ‌ల్లో ఈ సాగు విధానాన్ని చేప‌ట్టి.. పోష‌క‌విలువ‌ల‌తో కూడిన ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు పండించి ఉప‌యోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. జిల్లా క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లో ఏటీఎం ప‌ద్ధ‌తిన చేప‌ట్టిన ప్ర‌కృతి సాగును బుధ‌వారం క‌లెక్ట‌ర్ డిల్లీరావు ప‌రిశీలించారు. నిరుప‌యోగంగా ఉన్న క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ ఖాళీస్థ‌లాన్ని ప్ర‌కృతి సాగుకు ఉప‌యోగించి పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను పండించి ఉప‌యోగంలోనికి తీసుకురావడానికి కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ఇదే విధానాన్ని జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో అమ‌లుచేసేలా అధికారులు సిబ్బందిని ప్రోత్స‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ర‌సాయ‌న ఎరువులు కాకుండా ప్ర‌కృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామ‌ని.. రైతులు కూడా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను ఆచ‌రించేలా ప్రోత్స‌హించాల‌ని సంబంధిత శాఖ‌ల అధికారుల‌కు సూచించారు. కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు వంటి వాటిని ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విధానంలో పండించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఆదాయం పొంద‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను కూడా కొని, వాటిని పండిస్తున్న రైతుల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. విజ‌య‌వంతంగా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విధానాలు ఆచ‌రిస్తూ సాగును లాభ‌సాటిగా మార్చుకున్న రైతుల విజ‌య‌గాథ‌ల‌ను మిగిలిన వారికి తెలిసేలా అలాంటి రైతుల‌తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఇందులో వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు ఆదేశించారు. కలెక్ట‌ర్ వెంట క‌లెక్ట‌రేట్ ఏవో ఇంతియాజ్ పాషా, ఆఫీస్ స‌బార్డినేట్ స్వామి, క‌లెక్ట‌రేట్ సిబ్బంది ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *