తెలుగు తేజం,విజయవాడ : కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిఫై ఆదివారం కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కోటి దీపాల నడుమ కొండ కాంతులీనింది. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించిన జ్వాలా తోరణం ఉత్సవానికి మరింత వెలుగునిచ్చింది. ఆదివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ పూర్తయిన అనంతరం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధానార్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు, అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ ఈవో ఎంవీ సురేష్‌బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మహామండపంపై మహాగోపురం ఎదురుగా ఏర్పాటుచేసిన అఖండ జ్యోతి వెలిగించారు. ఈ వేడుకను చూడడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. మహాగోపురం ఎదుట, మల్లేశ్వరాలయం ముందు, కనకదుర్గానగర్‌లో భక్తులు దీపాలు వెలిగించారు. కాగా, దేవస్థానం అధికారులు, సిబ్బంది, పాలకమండలి సభ్యులు సోమవారం ఉదయం గిరిప్రదక్షిణ చేయనున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరుగుతుందని ఈవో సురేష్‌బాబు తెలిపారు.