గుంటూరు: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తం సీఎం జగన్ అరాచకాలకు కాపలా కాస్తోందని తెదేపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గుంటూరులో తలపెట్టిన శాంతి ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు కన్నాను గృహ నిర్భందం చేశారు. దీనీపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి, పోలీసుల తీరుపై మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. పోలీసుల అండతో విపక్షాలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో మహిళలు, చిన్న పిల్లలు అదృశ్యమవుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు.. ముఖ్యమంత్రి అరాచకాలకు అండగా నిలవడంతోనే సరిపోతోందని ఎద్దేవా చేశారు.