ఐదు రోజులు జరిగే అవకాశం..
వ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్షాలు
ప్రజా ప్రాధాన్యత గల అంశాలపై చర్చకు అధికార పక్షం సిద్ధం
20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్
ప్రణబ్, ఎస్పీ బాలుకు తొలి రోజు సంతాపం
తెలుగు తేజం : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ సమావేశాల్లో 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఉపాధి హమీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణి, ఇసుక పాలసీ..ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలియజేయనుంది.
చర్చకు రానున్న అంశాలు
పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ.
ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు,
నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది.
వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు.