తెలుగు తేజం, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ విజయవాడలో భారత్ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రాస్తారోకోలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. మరోవైపు బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
విజయవాడలో ప్రయాణికుల ఇబ్బందులు
భారత్ బంద్ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులను నిలిపివేసింది. బంద్ ప్రభావంతో బస్సులు నిలుపుదల సమాచారం తెలియక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. పిల్లా, పాపలతో ప్రయాణికులు బస్టాండ్లకు పరిమితమయ్యారు.దూరప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మరోవైపు ఇదే అదునుగా ఆటో, టాక్సీవాలాలు దోచుకుంటున్నారు.