మచిలీపట్నం: కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే వెంకట్రామయ్య(నాని)ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలంటే లెక్కలేని తనంతో ఏలూరు కలెక్టర్ వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. మంగళవారం చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరగ్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు, ఏలూరు జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావటంతో పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఏలూరు కలెక్టర్, ఆ జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై ఆనాడు తీవ్ర స్థాయిలో మండిపడడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ రాజ్యాంగ బద్ధమైనదని, సమావేశాలకు కలెక్టర్లు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అంటూ ఆనాడు పేర్ని నాని ఇచ్చిన వినతి పత్రంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి జడ్పిటిసి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంతో ఆ సమస్య మరోసారి పునరావృతమైంది. దీంతో సభలో ఉన్న మచిలీపట్నం శాసనసభ్యులు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు నెలలకు ఒక్కసారి జరిగే సమావేశాలకు జిల్లా అధికారులు హాజరు కాకపోతే సభ్యులు అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఇరిగేషన్ బోర్డ్ అడ్వైజరీ కమిటీ సమావేశం పేరుతో గైర్హాజరు కావటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎజెండా పంపిన అనంతరం, అదే రోజు ఐ డి బి సమావేశం ఎలా వేస్తారు అంటూ నిలదీశారు. ప్రాధాన్యత కలిగిన జడ్పీ సమావేశానికి కలెక్టర్ రాకుండా, కింది స్థాయి అధికారులను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్ని నాని ఆరోపించారు. దీనిపై జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ… ఏలూరు జిల్లాలో ఐ డి బి సమావేశం ఉందని ఇరిగేషన్, వ్యవసాయ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు సమావేశానికి రావడం లేదని ఏలూరు జిల్లా కలెక్టర్ లెటర్ పంపించినట్లు తెలిపారు. జడ్పీ సమావేశానికి రాకపోతే సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరు ఇస్తారని ఏలూరు కలెక్టర్ ను ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే సీఎంఓ నుంచి ఐడిబి సమావేశం అత్యవసరంగా వెయ్యమని ఆదేశాలు వచ్చినట్లు కలెక్టర్ చెప్పారని పేర్కొన్నారు.
పేర్ని నాని మాట్లాడుతూ… ఇటీవల కొంతమంది ఐఏఎస్ అధికారులు సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారని, జిల్లాలో జరిగే సమావేశాలకు అక్కడ నుంచి ఎందుకు ఆదేశాలు వస్తాయి అంటూ ప్రశ్నించారు. కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల లెక్కలేని తనాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సమావేశం అత్యవసరంగా జరపాలంటే జడ్పీ సర్వసభ్య సమావేశం రోజే జరపక్కర్లేదని, ముందు రోజు గానీ, సమావేశం అయిపోయిన సాయంత్రం కానీ నిర్వహించుకోవచ్చని చెప్పారు. సమావేశానికి గైరాజరైన ఉన్నతాధికారులను పిలిపించి, త్వరలో అత్యవసర జడ్పీ సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పేర్ని నాని కోరారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్, త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.