సందడి లేని వివాహాలు.. శుభకార్యాల్లో కానరాని జనం
నిన్నటి వరకూ కరోనా.. ఇప్పుడు వింతవ్యాధి ప్రభావం
తెలుగు తేజం, ఏలూరు: ‘ఆకాశమంత పందిళ్లు- భూదేవంత వేదికలు- మిన్నంటే సన్నాయి మేళాలు- రాశుల కొద్దీ వంటకాలు’ అన్నీ ఉన్నా.. అయినవాళ్లు, ఆహ్వానించిన అతిథులు లేక పెళ్లిళ్లు, శుభకార్యాలన్నీ వెలవెలబోతున్నాయి. ఊహించని వింత వ్యాధి కారణంగా ఏలూరు నగరంలో శుభకార్యాల్లో సందడి కనిపించడం లేదు. ఇప్పటివరకూ కరోనా కారణంగా ఆగిన శుభకార్యాలు, ఏడాది నిరీక్షణ అనంతరం ఎంతో అట్టహాసంగా చేసుకోవాలనుకున్న పెళ్లిళ్లు.. కళ తప్పిపోవడంతో అందరిలోనూ ఆవేదనే కనిపిస్తోంది. ముహూర్తాల సమయానికి కరోనా, లాక్డౌన్ రావడంతో అందరూ పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమై పెళ్లిళ్లకు అనుమతి వచ్చినప్పటికీ బంధువులు, అతిథులకు పరిమితి ఉండడంతో వెసులుబాటు వచ్చేవరకూ ఓపికగా ఎదురుచూశారు. నవంబరు నుంచి కరోనా తగ్గుముఖం పట్టడం, నిబంధనలు సడలించడం, వచ్చే జనవరి 8వరకే ముహూర్తాలు ఉండడంతో అందరూ డిసెంబరులోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని ఉపద్రవం విరుచుకుపడడంతో ఏలూరులో మళ్లీ లాక్డౌన్ వచ్చిందా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. బంధువులు, అతిథులు ‘రాలేకపోతున్నాం’ అన్న సమాచారమిచ్చి తప్పుకుంటున్నారు.
కల్యాణ మండపాల్లో పెట్టుకున్న కార్యక్రమాలను కొందరు ఇళ్లకు మార్చుకుంటున్నారు. తప్పదని వచ్చినవారు శుభకార్యాన్ని చూసుకుని వెళ్లిపోతున్నారే తప్ప విందు ఆరగించడానికి ముందుకు రావడం లేదు. బంధువులు, అతిథులు రాలేదన్న బాధ ఒకవైపు, ఆహార పదార్థాలు వృథా అయిపోయాయన్న ఆవేదన మరోవైపు.. శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లలో సంతోషాన్ని దూరం చేస్తున్నాయి.
వింత వ్యాధితో మరో ఐదుగురు ఆస్పత్రికి
అంతుచిక్కని వ్యాధి తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో శనివారం జరిగిన సంఘటనలతో ఏలూరులో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గన్‌బజార్‌కు చెందిన న్యాయవాది సుందరరావు మోటారు సైకిల్‌పై కోర్టు నుంచి ఇంటికి వెళ్తుండగా ఓవర్ బ్రిడ్జి మీద అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వాహనదారులు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం ఐదుగురు వింత వ్యాధితో ఆసుపత్రికి రాగా ఇద్దరిని విజయవాడకు రిఫర్ చేశారు. ఇప్పటివరకూ ఆసుపత్రి రికార్డుల్లో నమోదైన వింత వ్యాధిగ్రస్తుల సంఖ్య 615 కాగా, 576 మంది డిశ్చార్జి అయ్యారు. 35మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేయగా, ఏలూరు ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.