విజయవాడ : వైద్య విధానంలో ఫిజియోథెరపీ అనేది ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యారావుపేటలోని స్టార్ ఫిజియోథెరపీ హాస్పటల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. నేటి పరిస్థితులలో వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫిజియోథెరపీ ఆవశ్యకత నెలకొందన్నారు. సమాజసేవే లక్ష్యంగా పని చేస్తున్న జర్నలిస్టులకు వారి కుటుంబాలకు ఫిజియోథెరపీ అనేది నేడు చాలా అవసరమని తలంచి జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు 50 శాతం రాయితీ కల్పిస్తూ డాక్టర్ ప్రభుదాసు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఉచిత సేవలు అందించినందుకు స్టార్ ఫిజియోథెరపీ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే సహకారంతో ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఎప్పుడైనా రాయితీతో వైద్య సేవలు చేసేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనను ఈ సందర్భంగా సత్కరించారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనియన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కలపాల ప్రవీణ్ మాట్లాడుతూ ఫిజియోథెరపీలో ఐదు రకాలున్నాయన్నారు. వాటిలో పీడియాట్రిక్, ఆర్ధో, న్యూరో, స్పోర్ట్స్, కార్డియాక్ రిహాబిలిటేషన్స్ ఉన్నాయన్నారు. చిన్న పిల్లలలో శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడం, బుద్దిమాంధ్యత, నరాల సమస్యలు ఉంటాయని వాటికి టాబ్లెట్స్ రహిత వైద్యం ఎంతో అవసరమన్నారు. ఫిజియోథెరపీ అంటేనే టాబ్లెట్స్ రహిత వైద్య విధానమని ఆయన తెలిపారు. అలాగే పెద్ద వాళ్లకు కీళ్లు, భుజం, మెడ, తుంటి నొప్పులు, సయాటికా వంటి వ్యాధులకు, గూడజారడం, గూడ బిగుసుకుపోవడం వంటి వాటికి ఫిజియోథెరపీ ద్వారానే నయం అవుతుందన్నారు. విరిగిన ఎముకలకు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది ఎంతో అవసరమైన దశలో ప్రతి హాస్పిటల్ కు ఫిజియోథెరపీ డాక్టర్ ఆవశ్యకత నేడు ముఖ్యమైనదిగా ఏర్పండిందన్నారు. న్యూరో విషయంలో కానీ, స్పోర్ట్స్ తదితర అంశాలలో పక్షవాతం, నరాల బలహీనత, కండరాల బలహీనత వణుకుడు రోగం, వెన్ను సంబందిత వ్యాధులు, కండరాల నొప్పులు ఏర్పడినప్పుడు మందులు లేకుండా ఫిజియోథెరపీ అనేది చాలా అవసరమన్నారు. అలానే కార్డియాక్ లో గుండె ఆపరేషన్ తర్వాత ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధులకు ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమన్నారు. నేడు ఫిజియోథెరపీ ఆవశ్యకతను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక గుర్తింపు ఇస్తూ అనేక చర్యలు తీసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, షేక్ బాబు, చేయూత మానసిక వికలాంగుల శిక్షణా సంస్థ అధ్యక్షులు టి. కృష్ణ కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్టార్ ఫిజియోథెరపీ అధినేత ప్రభు దాసును యూనియన్ నేతలు సత్కరించగా, యూనియన్ నేతలను ప్రభుదాసు సత్కరించారు.