న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసింది. కేసులో నిందితులుగా ఉన్న తెలుగుదేశం నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది.