వృద్దాప్యంలో మాజీ పోలీస్ కుటుంబం ఇబ్బందులు
తెలుగు తేజం, మంగళగిరి: స్థానిక ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు ఆనుకుని ఉన్న గృహాల యజమానుల భాదలు వర్ణనాతీతం. గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా తమ సమస్యలు తీరడం లేదు.
ఇంట్లో నుండి బయటకు రాలేక పోతున్నామంటూ రిటైర్డ్ ఆర్ ఎస్ ఐ సుదర్శనరావు తన భాదను వ్యక్తం చేస్తూ 1972 నుండి 1997 వరకు ఇక్కడే తాను ఉద్యోగం చేశానని, క్యాంపుకు ఎదురువైపు ఉన్న 167 సర్వే నంబరులో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాను ఇళ్ళు నిర్మించుకున్నప్పటికీ బెటాలియన్ భద్రత పేరుతో 2003 సంవత్సరంలో తమ నివాసాల ముందు అధికారులు ఇనుప ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారని వాపోయారు. సమస్య పరిష్కారానికి బెటాలియన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు అందరి వద్ద వెళ్ళినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గతంలో ప్రక్క ఇంటి నుండి వెనుకబజారుకు వెళ్ళి రాకపోకలు సాగించుకునే వారమని, నేడు వారుకూడా మాకు నడకదారి ఇచ్చేందుకు అంగీకరించడం లేదని తెలిపారు.
గతంలో ఏపీఎస్పీ బెటాలియన్ మెత్తం ఫ్రీ జోన్ గా ఉండేది. బెటాలియన్ రోడ్డు నుండే చుట్టు ప్రక్కల గృహాలకు దారి ఉండేది. కాలక్రమేణా భద్రత కారణాల పేరుతో ఏపీఎస్పీ బెటాలియన్ చుట్టూ ఇనుప ఫెన్సిగ్ ఏర్పాటు చేశారు. దీంతో చుట్టుప్రక్కల నివాసాల ప్రజలు రాక పోకలకు దారిలోక ప్రక్క ఇంటి నుండో వెనుక ఇంటి నుండో నడక దారి ఏర్పాటు చేసుకుని వెనక వైపు నుండి రాకపోకలు సాగిస్తున్నారు. కొనమెరుపేమిటంటే ఇక్కడ నివాసముంటున్న వారందరూ గతంలో ఎప్పీఎస్పీ బెటాలియన్ లో ఉద్యోగాలు చేసిన పోలీసులే.
వృద్ధాప్యంలో హాయిగా ఉందామని ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి, ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే నేడు అదే తమకు శాపంగా మారిందని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసరమై ఆసుపత్రికి వెళ్లాలన్నా అవకాశం లేదని అన్నారు. తన భార్యకు పక్షవాతం కావడంతో ఫిజియేథెరపీ వైద్యులు సైతం రాలేని పరిస్థితి నెలకొందని అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇదే పరిస్థితి ఇక్కడ ఉన్నవారందరూ అనుభవిస్తున్నారని తెలిపారు.