విజయవాడ : పరిపాలన చేతకాని జగన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పించడం తగదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. సంక్షేమ పధకాల అమలు పేరుతో అప్పులు చేసి మరీ ఖజానా ఖాళీ అయినా గొప్పలు చెప్పడం తగదని ఆరోపించారు. గవర్నర్కు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, కనీసం దీనిపై గవర్నర్ స్పందించలేదని అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నా దానిపై కూడా గవర్నర్ ఏనాడూ సీఎంను పిలిచి మాట్లాడలేదని, మూడు రాజధానుల బిల్లులో గవర్నర్ కూడా తప్పు చేశారని విమర్శించారు. ఈ బిల్లులు సరికాదని కోర్టులు కూడా చెప్పాయన్నారు. ఎన్నికల సంఘంపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని, ఈసీని ఎవరికీ తెలియకుండా తొలగించారన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని రాత్రికి రాత్రే రద్దు చేశారని మండిపడ్డారు. అందరూ ఒప్పుకున్న చట్టాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ప్రశ్నించకుండా సంతకం చేశారని శైలజనాథ్ విమర్శించారు.