తాడేపల్లి: ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యమిత్రలను తప్పనిసరిగా నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్ విధానం అమలు చేయాలని.. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని తెలిపారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలంసాహ్ని, డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.
ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్యమిత్రలు ఈ ఆరు ప్రమాణాలు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కచ్చితంగా అమలవ్వాలి. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లోనూ ఇవే ప్రమాణాలు పాటించాలి. రోగులకు ఆరోగ్య మిత్రలు పూర్తి స్థాయిలో సేవలందించాలి. 104 కాల్ సెంటర్ మరింత సమర్థంగా పని చేయాలి. అధికారులు ఈ కాల్ సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా మాక్ కాల్స్ చేయాలి. ఫోన్ చేసిన అర గంటలో బెడ్ల కేటాయింపు జరగాలి. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలని’’ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.