హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్‌గా కొనసాగిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపారు. నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో.. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ నష్టాలను పూడ్చుకుంటూ క్రమంగా లాభాల్లోకి తెచ్చే క్రమంలో కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. వేలాదిమంది ఉద్యోగుల జీవితాలతో ముడి పడి ఉన్నందున ఆర్టీసీని ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. లక్షలాదిమంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ జనం హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసీకి అండదండలు అందించారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. జీతాలు లేక వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడినా ఉద్యమానికి ఊపిరు లూదారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచారు. ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి భరోసా కల్పించారు.