ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఇందుకు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి.
డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటివరకూ కేంద్రంతో అయిదు దఫాలుగా ఆందోళన చేస్తున్న రైతు నేతలతో చర్చలు జరిపింది. వారు నిర్వహించిన చర్చలు ఫలించలేదు. ఒకవైపు చర్చలు సాగుతుంటే మరోవైపు బంద్ ఎందుకు? అన్న ప్రభుత్వ ప్రశ్నను పక్కనపెట్టాయి. 6వ విడత చర్చలకు ఒకరోజు ముందు ఈ భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి.
పార్టీల జండాలు లేకుండానే బంద్‌లో పాల్గొనాలని రైతు నేతుల కోరారు. వారి కోరిక మేరకు అంతా ఆకుపచ్చ జెండాలతోనే బంద్‌లో పాల్గొంటున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా దీన్ని నిర్వహించాలని కోరారు. కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతిచ్చినందున ఎవరిపై బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు.
విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తాము ఉంటున్న చోట్లే నిరసనలు వ్యక్తం చేస్తూ బంద్‌కు మద్దతిస్తున్నందున ఈ ఆందోళన అంతర్జాతీయ రూపు సంతరించుకొందని ప్రకటించారు. రోజంతా మార్కెట్లు, దుకాణాలు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కూరగాయలు, పాల సరఫరా దుకాణదారులు కూడా పాల్గొనాలని కోరారు. అత్యవసర సేవలు, అంబులెన్సులు, వివాహ కార్యక్రమాలకు మాత్రమే అనుమతిస్తారు.