రైతు నేత రాకేశ్ టికాయిట్ వ్యాఖ్యలు
దిల్లీ: వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు చేస్తున్న రైతులతో చర్చలు జరపాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే అధికారికంగా చెప్పాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిట్ అన్నారు. ఆ చట్టాలను రద్దు చేయడం మినహా ఏం చేస్తామన్నా అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రతిపాదనలను రైతులు అంగీకరించాలని, చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కేంద్రమంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమతో చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరపాలనుకుంటున్నారో రైతులకు చెప్పాలన్నారు. గతంలో జరిగిన చర్చలకు అధికారికంగానే ఆహ్వానించారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానిస్తే, సమన్వయ కమిటీలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మూడు చట్టాలు రద్దు చేసేదాకా ఇంటికి తిరిగి వెళ్లేది లేదని ఆయన చెప్పారు. తదుపరి చర్చల కోసం ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి ఆహ్వానమూ ఇప్పటివరకు అందలేదన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లు దిగ్బంధిస్తామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
మరోవైపు, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన శాంతియుత ఆందోళనలు 16వ రోజూ కొనసాగాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆరు విడతలుగా చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతుండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం సవరణలు చేస్తాం గానీ.. రద్దుచేసే ప్రసక్తేలేదని తేల్చి చెబుతుండటంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.