విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో ఏర్పాట్లను కలెక్టర్ ఢిల్లీ రావు, అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మీడియాతో మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనార్ధం లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. క్యూలైన్లలో ఎప్పటికప్పుడు సజావుగా సాగే విధంగా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ సదుపాయం కల్పించామని, స్నాన ఘాట్లలో పుణ్య స్నానాల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేసినట్లు తెలిపారు. రోజుకు లక్ష మందికి పైగా, మూలానక్షత్రం రోజున మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, వీఐపీల కన్నా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు.