విజయవాడ : బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. ఎంతో మహిమాన్వితమైన బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. బాలాదేవి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దుర్గమ్మను తొలి దర్శనం చేసుకున్నారు. గవర్నర్కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపైఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
దుర్గమ్మ ఈ ఏడాది తొమ్మిది రోజుల్లోనే పది అవతారాల్లో దర్శనమివ్వనుంది. మొదటి రోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా, రెండో రోజు సోమవారం గాయత్రీదేవి, మూడో రోజు అన్నపూర్ణాదేవి, నాలుగో రోజు మహాలక్ష్మీదేవి, ఐదో రోజు శ్రీమహాచండీదేవి, ఆరో రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఏడో రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిదేవి, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవి రూపంలో దుర్గమ్మ భక్తులకు అభయం ఇవ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.