అమరావతి : ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ వినియోగించరాదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జనరల్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ,జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ఈనెల మూడవతేదీన రాష్ట్ర సచివాలయంలో ఛీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రజాస్వామ్యాన్ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి స్వేచ్చాయుత ఎన్నికల నిర్వహణ కోసం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పూర్వ హైకోర్టు న్యాయమూర్తి జి.భవాని ప్రసాద్ నేతృత్వంలో ఏర్పడి కృషిచేస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో లక్షలాది ఓట్లు తారుమారు అవుతున్నాయని, భోగస్ ఓట్లు తొలగించి అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చుకోవడానికి ప్రత్యేక కృషి జరగాలని కోరారు. ఈ భాద్యతలను నిర్వర్తించడానికి ఎలాంటి ఎన్నికల అనుభవం లేని ఇటీవలనే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వార్డ్ సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవడం, వారితో వాలంటీర్లు కలిసి పనిచేయడం వలన స్వేచ్చాయుత ఎన్నికలకు అవరోధాలు కలుగుతున్నాయని వివరించారు. ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేసే ప్రక్రియలో ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాద్యాయులను వినియోగించుకోవాలని ఎ.కె. మీనా కు తెలిపారు. అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న వాలంటీర్లను ఎలాంటి పరిస్థితులలో ఎన్నికల విధులు కేటాయించవద్దని ఎన్నికల కమీషన్ పేర్కొన్నప్పటికీ అనేకచోట్ల సచివాలయ సిబ్బంది తోపాటు, అధికార పార్టీ నేతలతో కలిసి వాలంటీర్లు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. భోగస్ ఓట్ల రద్దు కార్యక్రమంలో ఎలాంటి విధానాలను అమలు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారన్నారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయకుండా స్వేచ్చాయుత ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించలేమన్నారు. ఛీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ఎం.కె. మీనా స్పందిస్తూ వాలంటీర్లను ఎలాంటి పరిస్తితులలో ఎన్నికల విధులలో వాడుకోమని, ఎవరైనా అధికారులు ఎన్నికల విధులలో వాలంటీర్లను వినియోగిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వై ఎపి నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో నెలరోజులపాటు వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేయబోతున్నారని ఇది ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా ? అనే అనుమానాలను రేకెత్తిస్తుందని కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని ఎన్నికల సమయంలో రాజకీయ లబ్దికోసం ఉపయోగిస్తున్నారని వీటిని నిరోధించాలని కోరగా అక్టోబర్ 11నుండి ప్రారంభం అవుతున్న వై ఎపి నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసి తగు చర్యలు చేపడతానని ఎం.కె. మీనా తెలిపారు.