Breaking News

ఎస్‌ఈబీకీ ‘ఎక్సైజ్‌’ అధికారాలు

తెలుగు తేజం, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా, జూదం, డ్రగ్స్, గంజాయి వంటి వంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ)కి ప్రభుత్వం అదనపు అధికారాలను కట్టబెట్టింది. ఈ మేరకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌భార్గవ్‌ (ఎక్సైజ్‌), ఎక్స్‌అఫీషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీ గౌతమ్‌ సవాంగ్‌(డీజీపీ) మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్‌–1968, ఏపీ ప్రొహిబిషన్‌ యాక్ట్‌–1995, ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌–1985లోని పలు సెక్షన్ల ప్రకారం ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖకు గల పలు అధికారాలు ఇకపై ఎస్‌ఈబీకి కూడా ఉంటాయి. అక్రమ మద్యం, సారాను, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ధ్వంసం చేయడం, వేలం వేయడం తదితర అన్ని అధికారాలను ఎస్‌ఈబీకి అప్పగిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇటీవల వరకు ఎస్‌ఈబీ స్వాధీనం చేసుకున్న 2.8 లక్షల లీటర్ల మద్యం విషయంలోనూ ఎస్‌ఈబీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టేలా అధికారం ఇచ్చారు.

‘గనుల’ అధికారాలు కూడా..
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా భూగర్భ గనుల శాఖకు ఉండే అధికారాలను ఎస్‌ఈబీకి కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్‌)–1957లోని నిబంధనలను సవరించింది. కోర్టుల్లో కేసులు పెట్టాలంటే ఇçప్పుడున్న ఎంఎండీఆర్‌ నిబంధనల ప్రకారం భూగర్భ గనుల శాఖ అధికారులకే అధికారం ఉంది. ఇప్పుడు ఎస్‌ఈబీ అధికారులకు కూడా ఈ అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను చేర్చింది. దీని ప్రకారం ఎస్‌ఈబీ అధికారులు కూడా ఇసుక క్వారీలను తనిఖీ చేయవచ్చు. క్వారీ పరిమాణాన్ని కొలతలు వేయవచ్చు. ఏ క్వారీలో అయినా ఇసుక పరిమాణాన్ని తూకం, కొలత వేయించవచ్చు. రికార్డులు, రిజిష్టర్, పత్రాలు తనిఖీ చేయవచ్చని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మంగళవారం ఉత్తర్వులిచ్చారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *