అమరావతి: రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలను ఖరారుచేస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన కేటగిరీల టీచర్లు ఈ బదిలీల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–54 విడుదల చేశారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి కూడా ప్రభుత్వం జీవో–53ని జారీచేసింది. బదిలీలు ఆన్లైన్లో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా చేయనున్నారు. ఈ ఉత్తర్వులు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బదిలీల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇతర యాజమాన్యాల స్కూళ్ల టీచర్ల బదిలీలకు ఆయా విభాగాలు షెడ్యూల్ ఇవ్వనున్నాయి.