ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయి : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్
అమరావతి : ఏపీలో పెట్టుబడులకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభమైంది. ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ పెవిలియన్‌ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. 500 స్క్వేర్ మీటర్లలో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ ఉత్పత్తులు, ప్రభుత్వ పథకాలు, ఫుడ్ కోర్టులు, టూరిజం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ…‘‘ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ట్రేడ్ ఫెయిర్ ద్వారా తెలియజేస్తున్నాం. దేశంలో ఎగుమతుల్లో ఆరోస్థానంలో ఏపీ నిలిచింది. ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ 1గా ఏపీ ఉంది. మూడు ఇండస్ట్రీయల్ కారిడార్లలో 45 వేల ఎకరాల్లో భూమి అందుబాటులో ఉంది.సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఏపీలో నాలుగు పోర్టులు అభివృద్ధి, 10 ఫిషింగ్ హార్బర్స్ అభివృద్ధి, కోస్ట్ లైన్‌ను ఉపయోగించుకునేల ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. ఏపీలో చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నాం. నేతన్న నేస్తం కింద గడిచిన ఏదేళ్లలో 900 కోట్ల సహాయం అందించాం. ఏపీ అభివృద్ధి, సంక్షేమాన్ని, వ్యాపార అనుకూల పరిస్థితులు ప్రపంచానికి చాటేలా ట్రెయిడ్ ఫేర్‌లో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశాం’’ అని మంత్రి అమర్నాథ్ తెలిపారు.