విశాఖపట్నం : ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఈ తుఫానుకు ‘నివర్’ అని పేరు పెట్టారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి, ఈనెల 25న మధ్యాహ్నం కరైకల్(పుదుచ్చేరి)-మహాబలిపురం(తమిళనాడు) మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అనేకచోట్ల ఉరుములతో వర్షాలు, ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, 25, 26 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రధానంగా నెల్లూరు నుంచి గుంటూరు వరకు అక్కడక్కడ అసాధారణ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.