టెక్నాలజీ వినియోగంపై ఐదు స్కోచ్ అవార్డులు
తెలుగు తేజం, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ జాతీయస్థాయిలో 18 అవార్డులు ప్రకటించగా.. వాటిలో ఏకంగా ఐదు అవార్డులను ఏపీ పోలీసు శాఖ కు దక్కాయి. దీంతో కేవలం 11 నెలల వ్యవధిలోనే ఏకంగా 108 జాతీయ అవార్డులను దక్కించుకుని ఏపీ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా అవార్డులు దక్కించుకున్న వాటిల్లో సైబర్ మిత్ర (మహిళా భద్రత)తో పాటు అందుబాటులో నేరస్తుల వివరాలు (అఫెండర్ సెర్చ్), మహిళల భద్రత (ఉమెన్‌సేఫ్టీ) కార్యక్రమాల అమలులో విజయనగరం జిల్లా, ఫ్యాక్షన్ గ్రామాల్లో నిందితుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన ‘సువిధ’ కార్యక్రమం అమలులో అనంతపురం జిల్లా, టెక్నాలజీలో పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ‘ప్రాజెక్ట్ టాటా’ కార్యక్రమం అమలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగం స్కోచ్ అవార్డులను దక్కించుకున్నాయని ఏపీ పోలీస్ టెక్నాలజీ చీఫ్ పాలరాజు తెలిపారు. ఈ అవార్డుల్లో సైబర్ మిత్ర, ప్రొజెక్ట్ టాటా కార్యక్రమాలు రజత పతకాలు సాధించాయి.