తెలుగు తేజం, అమరావతి : ఎన్నో సంవత్సరాల పాటు ఒకేచోట విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులకు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ఆలయ ఉద్యోగి ఆ ఆలయంలోనే పనిచేయాలనే నిబంధనలను మారుస్తూ బదిలీలకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతమున్న దేవదాయ, ధర్మదాయ చట్టంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. 6(సీ-చిన్న ఆలయాలు) మినహా అన్ని ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ ఆలయంలో ఉద్యోగంలో చేరితే ఆ ఆలయమే వారికి పేరెంట్ సంస్థగా ఉంటుంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్ అయ్యేవరకు అక్కడే పనిచేయాల్సి ఉంది.
తప్పని పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్నా.. అవకాశాన్ని బట్టి వేరే ఆలయానికి డెప్యుటేషన్‌పై పంపడమే తప్ప అధికారికంగా బదిలీ చేసే విధానం లేదు. దీనివల్ల కొందరు ఉద్యోగులు ఆలయం పాలనను తమ గుప్పిట్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరు వచ్చినా తమను మార్చ లేరు అనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ కేడర్ ఉద్యోగులను అదే కేడర్ ఆలయాలకు బదిలీ చేయాలని తెలిపింది. బదిలీలు ప్రభుత్వ బదిలీల విధానానికి లోబడే ఉంటాయని సర్కారు స్పష్టం చేసింది.