న్యూఢిల్లీ: దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేది. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న తొలి విడత పోలింగ్, నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరుగనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మాదిరిగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఛత్తీస్గఢ్ తొలి దశ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది అక్టోబర్ 20, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23. అక్టోబర్ 21 నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. నవంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్గఢ్ రెండో దశ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 2 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి నవంబర్ 9 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. నవంబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.