తెలుగు తేజం, అమరావతి: ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో ఇల్లు.. ఉచితంగా రిజిస్టరషన్ చేయనున్నట్లు తెలిపారు. ఇంటిని లబ్ధిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో స్పందన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వివరించారు. మూడేళ్ళలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జగన్ తెలిపారు.