ఆక్రమించి అక్రమ వ్యాపారాలు – నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు
ఆక్రమణలు కాపాడుకోవడానికి కప్పలవాగుకు అడ్డుకట్ట వేసిన వైనం
మాజీ మంత్రి దేవినేని హయాంలోనే ఆక్రమణకు అంకురార్పణ
కప్పులవాగు దారి మళ్లింపుతో తారకరామ పథకానికి ముప్పు
తారకరామ పథకం పునాదులు బయటపడిన వైనం
పత్తా లేని అధికారులు
తెలుగు తేజం, జి.కొండూరు : జాతీయ రహదారి పక్కన విలువైన స్థలం వ్యాపారానికి అనువైన చోటు కప్పల వాగు పక్కనే ఉంది. ఇంకేముంది అక్రమార్కుల కన్ను ఖాళీ స్థలంపై పడింది. అంతే అక్రమార్కులు రెచ్చిపోయారు. దర్జాగా కప్పలవాగును అక్రమించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తే వారి ఆక్రమించి వేసిన రేకుల షెడ్లు కొట్టుకు పోతాయి కాబట్టి..వారు కప్పుల వాగును దారి మళ్లించారు. వాగును దారి మళ్లించిన కారణంగా తారకరామా ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ కు ముప్పు ఏర్పడింది. కృష్ణాజిల్లా జి.కొండూరు – విద్యానగరం గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కనే కప్పల వాగు ఉంది. ఎగువ నుంచి కురిసిన వర్షపు నీరు మొత్తం కప్పలవాగు గుండా దిగువకు వెళుతూ ఉంటుంది. కప్పల వాగు పక్కనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. ముందు చిన్న రేకుల షెడ్డు నిర్మించి దాన్ని క్రమేపీ విస్తరించారు. రైతుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారు పెడచెవిన పెట్టారు. ఈ ఆక్రమణకు అంకురార్పణ మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హయాంలోనే జరిగింది. ఆ స్థలంలో చట్టవిరుద్ధమైన వ్యాపారాలు చేస్తున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను, ఖైనీ, గుట్కాలను విక్రయిస్తున్నారు. విక్రయిస్తూ కూడా పోలీసులకు దొరికిపోయారు. ఆక్రమణలను విస్తరించే క్రమంలో కొందరు రైతులు అడ్డు చెప్పగా వారిని సైతం అక్రమ కేసులు పెడతామని బెదిరించినట్లు పలువురు పేర్కొన్నారు. ఇక ఆక్రమించిన భూమిలో వేసిన రేకుల షెడ్డును కప్పల వాగు బారినుండి కాపాడుకోవడానికి అక్రమార్కులు ఏకంగా కప్పలవాగును దారి మళ్లించారు. దారి మళ్లించిన కప్పలవాగును జి.కొండూరు 14వ వార్డు సభ్యులు, వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత పజ్జూరు నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. తారకరామా ఎత్తిపోతల పథకం 4వ పంప్ హౌస్కు సమీపంలోని కప్పలవాగుకు అడ్డుగా మట్టిని పోశారు. ఇక్కడ కప్పలవాగు తారకరామ కుడి ప్రధాన కాలువను క్రాస్ చేస్తుంది. క్రాసింగ్ జరిగే చోట మట్టి దిబ్బలు వేయడంతో కప్పల వాగు నుంచి ఉధృతంగా వచ్చే నీరు మొత్తం తారకరామా ఎత్తిపోతల పథకం కుడికాలువకు ఎగతన్నుతున్నాయి. దీనివల్ల గతంలో కురిసిన భారీ వర్షాల సమయంలో తారకరామా ఎత్తిపోతల పథకం 3వ పంప్ హౌస్ కోతకు గురైంది. పంప్ హౌస్ పునాదులు బయటపడ్డాయి. పంప్ హౌస్ చుట్టూ ఇరిగేషన్ అధికారులు మట్టిపోసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మరో సారి కనుక వాగు ఉధృతంగా వచ్చి ఉంటే…పంప్ హౌస్ కూలిపోయిన గాని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని రైతులు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కప్పలవాగు ఆక్రమణలు తొలగించి తారకరామా ఎత్తిపోతల పథకాన్ని రక్షించాల్సి ఉంది. తమ బహిరంగ ప్రయోజనాలను కాపాడాలని రైతుల తరపున 14 వార్డు సభ్యులు పజ్జూరు నాగమల్లేశ్వరరావు కోరుతున్నారు.