ప్రజలెవరూ సీరియస్‌గా తీసుకోవటం లేదు
మన దగ్గర తగ్గినా.. ఇతర రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి
నిర్లక్ష్యమే అక్కడ కేసుల పెరుగుదలకు కారణం
వ్యాక్సిన్ వేయించుకోవటం ఉత్తమం
వెయిట్ అండ్ సీ ధోరణి సరికాదు
అత్యవసర బులెటిన్‌లో కలెక్టర్ హెచ్చరిక
తెలుగు తేజం, విజయవాడ : ‘కరోనా తగ్గలేదు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. కరోనా పట్ల ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి పెరుగుతోంది. జాగ్రత్తలు తీసుకోవటం మానేస్తున్నారు. మన ప్రాంతంలో కేసులు తగ్గినా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. కొత్త స్ర్టెయిన్స్ వెలుగు చూస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం, అజాగ్రత్తే కొంప ముంచుతుంది. కరోనా వ్యాక్సిన్ సురక్షితం. వ్యాక్సిన్ ద్వారా మాత్రమే కరోనా నియంత్రణ సాధ్యం. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవటం అత్యుత్తమం.’ అని కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం అత్యవసర బులెటిన్‌ను విడుదల చేస్తూ, కలెక్టర్ చేసిన హెచ్చరికలు
నిర్లక్ష్యం పెరిగిపోయింది
కరోనా పట్ల చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవటం లేదు. భౌతిక దూరం పాటించటం లేదు. మాస్కులు ధరించటం మానేశారు. వ్యాక్సిన్ తీసుకోవటంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. హోటళ్లు, వ్యాపార సముదాయాలు, కార్పొరేట్ కాలేజీలు, సినిమాహాల్స్‌లో కూడా మాస్కులు ధరించటం లేదు. రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఫిబ్రవరిలో సింగిల్ డిజిట్లో మాత్రమే కేసులు నమోదయ్యాయి. హాస్పిటల్లో జాయిన్ అయ్యే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. మన దేశంలో సగ భాగంలో యాంటీబాడీల అభివృద్ధి ద్వారా కరోనా కేసులు తగ్గినమాట వాస్తవమే అయినా.. ఇది రిలాక్స్డ్ టైమ్ కాదని గుర్తించాలి.
కరోనా విస్తరిస్తోంది జాగ్రత్త
కరోనా లేదని, మాస్కులు ధరించటం వృథా అని భావిస్తున్నారు. కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోందన్నది గుర్తించాలి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి. కర్నాటక బెంగళూరుల్లో కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి ప్రజలు కూడా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించటం వల్లనే మళ్లీ కేసులు పెరిగాయి. హాస్పిటల్స్‌లో బెడ్స్ కూడా దొరికని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
వ్యాక్సిన్‌తో మాత్రమే నియంత్రణ
కరోనాను ఎదుర్కొనేందుకు, దానిని నియంత్రించేందుకు జిల్లాలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్పందన పెరగాలి. కరోనా వ్యాక్సిన్ విషయంలో వెయిట్ అండ్ సీ విధానం సరికాదు. వ్యాక్సిన్ సురక్షితం. నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ముందు భయాన్ని వీడి, అపోహలు విడనాడి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి. జిల్లాలో కోవాగ్జిన్ , కోవీషీల్డ్ వ్యాక్సిన్లను వేస్తున్నాం. మొదటి దశలో వైద్య సిబ్బంది, రెండవ దశలో కొవిడ్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రారంభించాం. త్వరలో మూడో దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, ఇతరులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నాం. కరోనా పట్ల నిర్లక్ష్యం తగదు. అలర్జీలు ఉన్న వారు మినహా మిగిలిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరూ మాస్కులు విధిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.