బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం స్థానిక మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్ ద్వారా వెల్లడించారు.
”కాస్త జ్వరం రావడంతో నేడు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాను. అందులో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండండి” – ట్విటర్లో యడియూరప్ప
కాగా.. యడియూరప్పకు కరోనా సోకడం ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి. గతేడాది ఆగస్టు 2న ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మణిపాల్ ఆసుపత్రిలో తొమ్మది రోజుల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆయన వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆసుపత్రిలో చేరడానికి కొద్ది గంటల ముందే సీఎం తన నివాసంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించారు.