Breaking News

కృష్ణాలో వ్యాక్సిన్‌కు అంతా రెడీ : కలెక్టర్‌ ఇంతియాజ్‌

తెలుగు తేజం, విజయవాడ : ‘వ్యాక్సినేషన్‌కు అంతా రెడీగా ఉన్నారని. డ్రై రన్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. శుక్రవారం జిల్లాలో 141 కేంద్రాల్లో మెగా డ్రై రన్‌ను నిర్వహించనున్నాం. కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ తప్పనిసరి కాకపోయినా… ప్రజలు వేయించు కోవడమే మంచిది..’ అని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు స్పెషల్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు బాగా తగ్గాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే తక్కువగానే ఉంది. అలా అని అజాగ్రత్త పనికి రాదు. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాల్సిందే. త్వరలో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్నందున ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో గత నెల 27, 28 తేదీల్లో వ్యాక్సిన్‌ డ్రై రన్‌ను విజయవంతంగా నిర్వహించాం. దీని ద్వారా వ్యాక్సినేషన్‌పై అవగాహన వచ్చింది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 141 కేంద్రాల్లో మెగా డ్రై రన్‌ నిర్వహించనున్నాం. వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్యశాఖ సిబ్బందికి, రెండవ ప్రాధాన్యతగా ఫ్రంట్‌లైన్‌లో పనిచేసే పారిశుధ్య, పోలీసు, రెవెన్యూ శాఖల సిబ్బందికి, మూడవ ప్రాధాన్యతగా 50ఏళ్లకు పైబడినవారికి, నాల్గవ ప్రాధాన్యతగా 50 ఏళ్లకంటే తక్కువ వయస్సున్న వారికి ఇస్తారు. వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరూ తీసుకోవటమే మంచిది. ఇందుకోసం ముందుగా రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. అది ఎవరికి వారే చేసుకోవచ్చు. రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారికి ఎప్పుడు ఎక్కడికి వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవాలో మెసేజ్‌ రూపంలో తెలియజేస్తారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చేటపుడు గుర్తింపుకార్డును తీసుకు రావాల్సి ఉంటుంది. కొవిడ్‌ వ్యాధిగ్రస్తులు పూర్తిగా తగ్గిన తర్వాతే వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిది. సైడ్‌ ఎఫెక్ట్స్‌ మీద పుకార్లు వస్తున్నాయి. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పరిశీలించిన తర్వాతే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా, అబ్జర్వేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత అర్ధగంట వరకు ఈ కేంద్రాల్లోనే ఉంచి పరీక్షించిన తర్వాతే పంపిస్తారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత తప్పకుండా రెండవ డోస్‌ తీసుకోవాలి. ఆ తరువాత రెండు వారాల్లో శరీరంలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెందుతాయన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *