హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. తొలిరోజు పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన ఆయన.. తాజాగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వరదలు, అకాల వర్షాల సమయంలో విపత్తు నిర్వహణ కింద రావాల్సి నిధులు, కేంద్రహోంశాఖ నుంచి పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల అంశాలపై కేసీఆర్ కీలకంగా ప్రస్తావించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో వరదలకు పాడైన రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా అమిత్‌షాతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ ఇంకా రెండురోజులపాటు దిల్లీలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, హర్దీప్సింగ్ పురి, నరేంద్రసింగ్ తోమర్లతో ఆయన సమావేశమయ్యే వీలుంది. దిల్లీలో తెరాస కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్ పరిశీలించి శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు.