తెలుగు తేజం, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఎస్‌ఏ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పెరిగిన జనాభా, పనిభారం ప్రాతిపదికగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఏపీఆర్‌ఎస్‌ఏ కొత్త కార్యవర్గ ప్రతినిధులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యద్భుతంగా ఏర్పాటు చేశారంటూ అభినందించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటే కొత్త మండలాల విషయం పరిశీలించాలని సీఎంకు వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూయేతర పనులు రెవెన్యూ ఉద్యోగులకు అప్పగించకుండా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఉద్యోగుల సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి పరిష్కార చర్యలు తీసుకోవాలని తన అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డికి సూచించారని బొప్పరాజు తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురి, ఏపీజేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ వైవీరావు సీఎంను కలిశారు.