దోషులను కాపాడుతున్నది ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య ఆరోపణ
వీరులపాడు : కృష్ణా జిల్లా వీరులపాడు మండలం లోని పెద్దాపురం గ్రామంలో నిప్పుల పల్లి ప్రభుదాస్, భార్య కమల, తల్లి సువార్తమ్మ లపై జరిగిన దాడి వెనుక ఉన్న వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ కోటేరు ముత్తారెడ్డిని కాపాడుతున్నది ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. సోమవారం తెలంగాణా రాష్ట్రం మధిరలో చికిత్స పొందుతున్న బాధితులతో ఆయన మాట్లాడారు. ఈమేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసులే వారిని బలవంతంగా తరిమివేశారని, ఏపీలో ఉంటే చంపేస్తారనే భయంతో ముగ్గురు తెలంగాణ పారిపోయి మధిరలో చికిత్స పొందుతున్నారన్నారు. తన దగ్గర పని చేసిన కోటేశ్వరరావుకు జీతం డబ్బులు ఎగ్గొట్టి, కులం పేరుతో ముత్తారెడ్డి దూషించాడని, ఈ మేరకు గతంలో వీరులపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోయినా, ఫిర్యాదును వెనక్కి తీసుకోవటం లేదనే కక్షతోనే , ఫించన్ డబ్బులు కోసం వచ్చిన అన్న, వదిన, తల్లిపై దాడి చేసి, కాళ్ళ మీద పడేలా హింసించారని బాదితులు వాపోయారన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్న ఎస్సీ నియోజకవర్గంలో దళితులకు న్యాయం చేయకపోగా చట్టానికి అడ్డుపడి నిందితుడిని కాపాడటం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కంచికచర్ల శ్యాం కుమార్ సంఘటన మరువక ముందే గొలుసు కట్టుగా దళితులపై దాడులు, దౌర్జన్యాలకు జరగటం పట్టు తప్పిన పాలనకు నిదర్శనంగా అభిప్రాయ పడ్డారు. ముత్తారెడ్డిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.