హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లకు గాను వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన 1,421 మంది అభ్యర్థులు 1,889 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో ఒక్కరోజే 1,223 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా నుంచి 400పైగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నామినేషన్లలో తెరాస (424), భాజపా(428), కాంగ్రెస్ (275), ఎంఐఎం (58), తెదేపా (155), సీపీఐ (12), సీపీఎం (17 ) నామినేషన్లు దాఖలు చేశాయి. గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 66, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 454 నామినేషన్లు దాఖలయ్యాయి.