రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. గాయపడిన జవాన్ ను హెలికాప్టరులో ఆసుపత్రికి తరలించారు. నక్సలైట్ల పేలుడు ఘటనతో సాయుధ పోలీసుల పహరాను ముమ్మరం చేశారు.
విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్ ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. జవాన్ ను శ్రీకాంత్ గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి.