తెలుగు తేజం, జగ్గయ్యపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిరువ్యాపారుల కోసం “జగనన్న తోడు” పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ గారు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఫుట్పాత్లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించే వారితోపాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బుట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ధి పొందడం జరిగిందన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో 594, జగ్గయ్యపేట మండలంలో 675, పెనుగంచిప్రోలు మండలంలో 274, వత్సవాయి మండలంలో 421 మంది మొత్తం జగ్గయ్యపేట నియోజకవర్గంలో “జగనన్న తోడు” పథకం ద్వారా 1964 మంది లబ్దిపొందారని వారికి రూ. 1 కోటి 96 లక్షల 40 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలియజేశారు.