తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం: జూపూడిలో మండల వ్యవసాయాధికారులు మంగళవారం డాక్టర్ వైఎస్సార్ పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సహాయ వ్యవసాయ సంచాలకులు బి.వెంకటేశ్వరరావు పొలం బడి ప్రాముఖ్యత, పురుగు మందులు విపరీతంగా వాడటం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పొలం బడిలో ముఖ్యపాత్ర అయిన (ఏఈఎస్ఏ) పరిసరాల పరిశీలన చేసి పొలంలో జింకు లోపం ఎక్కువ ఉందని, లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేటును రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి లోపాన్ని సవరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఇతర పోషక పదార్థాలు మొక్కకు అందక మరింత గిడసబారిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి డి.శైలజ, గ్రామ వ్యవసాయ సహాయకులు బి.రోజా, బి.నిరోషా, కె.పుల్లమ్మ, రైతులు, వాలంటీర్లు పాల్గొన్నారు.